బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం అభివృద్ధి పురోగమనం
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలే స్ఫూర్తిగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలి
ఖమ్మం మరింత ప్రగతిని సాధించాలని పువ్వాడ ఆకాంక్ష
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆకాంక్షించారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతులు, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఉపాధి రంగాల్లో అనేక కీలక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత లభించడంతో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. తన మంత్రిత్వ కాలంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం ప్రజల ప్రయోజనాలను, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లు, వంతెనలు, డ్రైనేజీ, తాగునీరు, ప్రభుత్వ భవనాలు, పట్టణ సుందరీకరణ, గ్రామీణ మౌలిక వసతులు తదితర రంగాల్లో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని వివరించారు.
ఖమ్మం జిల్లాలో సాగునీటి విస్తరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని సీతారామ ఎత్తిపోతల పథకం, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగునీటి వనరుల బలోపేతం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరం, జిల్లా పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించడంతో పాటు వాటిని మరింత విస్తరించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక సమానత్వం దిశగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు అందించిన అభివృద్ధి పునాదులపై మరింత ప్రగతిని సాధించి, ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.


