
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి చేరుకునేందుకు మరో కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవే మార్గంలోని తక్కెళ్లపల్లి నుంచి కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల మీదుగా ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పెరగనున్న భారీ వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని రూ.30 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు వరుసల రహదారి పనులు చేపట్టారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీకి ఉన్న ప్రధాన మార్గంపై ఒత్తిడి తగ్గించడంతోపాటు, పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, పరికరాల రవాణాను సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా తక్కెళ్లపల్లి వైపు 10 బహుళజాతి సంస్థలకు సుమారు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించారు. ఆయా సంస్థలు పరిశ్రమల నిర్మాణం చేపట్టడంతో భారీ యంత్రాలు, నిర్మాణ సామగ్రి, ఇతర పరికరాలను తరలించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలకు అనువుగా ప్రత్యేక రహదారిని నిర్మించాలని కంపెనీలు అధికారులను కోరాయి. దీంతో తక్కెళ్లపల్లి నుంచి కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల మీదుగా ఎనిమిది కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును రెండు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. రూ.30 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం ఫ్యూచర్ సిటీకి వెళ్లేందుకు తుక్కుగూడ నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ఉన్న రహదారే ప్రధాన మార్గంగా ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ అధికారులు, విదేశీ ప్రతినిధులు, అమెజాన్ డేటా సెంటర్ నిర్వాహకులు, పరిసర గ్రామాల ప్రజలు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలు, ఇతర సంస్థల నిర్మాణ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద యంత్రాలు, భారీ పరికరాలను తరలించే వాహనాలు ప్రధాన రహదారిపైకి వస్తే ట్రాఫిక్ రద్దీ పెరిగే ప్రమాదం ఉంది. ఈ సమస్యను ముందుగానే అధిగమించేందుకు తక్కెళ్లపల్లి మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొత్త రహదారి అందుబాటులోకి వస్తే నిర్మాణ సామగ్రి రవాణాకు ప్రత్యామ్నాయ మార్గం లభించడంతోపాటు, ఇప్పటికే ఉన్న రోడ్డుపై వాహనాల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.తక్కెళ్లపల్లి నుంచి నిర్మిస్తున్న రహదారిని భవిష్యత్తులో రతన్ టాటా రేడియల్ రోడ్డుతో అనుసంధానించాలన్నది అధికారుల ప్రణాళిక. ఈ అనుసంధానం పూర్తయితే ఫ్యూచర్ సిటీ నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. అలాగే కొంగరకలాన్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వైపు వెళ్లే వాహనాలకూ ఈ మార్గం ఉపయోగపడనుంది. దీంతో ఫ్యూచర్ సిటీకి రహదారి అనుసంధానం విస్తరించడమే కాకుండా.. పరిశ్రమల రవాణా అవసరాలకు అనుగుణంగా రోడ్ల నెట్‌వర్క్ అభివృద్ధి చెందనుంది. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటు, భారీ పెట్టుబడుల నేపథ్యంలో రహదారి సదుపాయాల అభివృద్ధి కీలకంగా మారుతోంది. కొత్త మార్గం ద్వారా పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సామగ్రిని తరలించడం సులభమవుతుంది. భవిష్యత్తులో వాణిజ్య కార్యకలాపాలు పెరిగినప్పుడు సరకు రవాణాకు కూడా ఈ రహదారి ఉపయోగపడే అవకాశం ఉంది.

