*అనధికార లేఔట్లపై ఉక్కుపాదం: పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహా కొరడా** వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్ల కూల్చివేత* జేసీబీలతో సరిహద్దు రాళ్లు, బోర్డులు నేలమట్టం* నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక వినుకొండ:పట్టణ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అనధికార లేఔట్లపై రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం కొరడా ఝుళిపించింది.
పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ) సంజనా సింహా ఆదేశాలతో, అధికారుల పర్యవేక్షణలో వినుకొండ టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ లేఔట్లను జేసీబీలతో కూల్చివేశారు. ప్రభుత్వ అనుమతులు, డీటీసీపీ (DTCP) లేదా సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని హద్దు రాళ్లు, బోర్డులు, తాత్కాలిక నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను నివాస స్థలాలుగా మార్చి వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను మోసగిస్తూ అక్రమ వ్యాపారాలు సాగిస్తే రియల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లేఔట్ వేసే ముందు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కు స్థలాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.
అనుమతులు లేని అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని, రిజిస్ట్రేషన్ శాఖ కూడా నిబంధనలు పాటించని స్థలాల రిజిస్ట్రేషన్లను తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసు బందోబస్తు పాల్గొన్నారు. అక్రమ లేఔట్ల తొలగింపు చర్యలతో పట్టణంలోని రియల్టర్లలో ఒక్కసారిగా గుబులు మొదలైంది.


