చైర్మన్గా దేవరపాటి వసంత.. వైస్ చైర్మన్గా దేవరపాటి మల్లీశ్వరి
ఆత్మకూరు, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): నువ్వూరుపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. విద్యా కమిటీ చైర్మన్గా శ్రీమతి దేవరపాటి వసంత, వైస్ చైర్మన్గా శ్రీమతి దేవరపాటి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తికావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి, ఆత్మకూరు మండల యూనిట్ ఇన్చార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి సూచనల మేరకు ఎన్నిక నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.విద్యా కమిటీ ఎన్నికల్లో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని నూతన కమిటీ ఎంపిక ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఏకగ్రీవంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కావడంతో పాఠశాల అభివృద్ధికి మరింత సమన్వయంతో పనిచేసే అవకాశం ఏర్పడిందని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ దేవరపాటి బాలకొండయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపాలు, ఉపాధ్యాయులు తుమ్మల గంగాధర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ దేవరపాటి వసంత, వైస్ చైర్మన్ దేవరపాటి మల్లీశ్వరికి పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు వారి సంక్షేమానికి అవసరమైన చర్యల్లో విద్యా కమిటీ చురుకైన పాత్ర పోషించాలని కోరారు. నూతన కమిటీ పాఠశాల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.


