గుండె వ్యాధితో బాధపడుతున్న ఖాదర్ బాషాకు మూడు నెలల మందులు అందజేత
ఆత్మకూరు, సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి):అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ అండగా నిలిచారు. ఆత్మకూరు పట్టణం 15వ వార్డుకు చెందిన ఎస్.కె. ఖాదర్ బాషా పద్మావతి టీ స్టాల్లో మాస్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల ఆయన గుండె సంబంధిత వ్యాధికి గురికావడంతో క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మందులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్థోమత లేక కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ విషయాన్ని 15వ వార్డుకు చెందిన ఎస్.కె. అబ్దుల్ రహీం డాక్టర్ ప్రణీత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డాక్టర్ ప్రణీత్, డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మూడు నెలలకు సరిపడా గుండె సంబంధిత మందులను ఉచితంగా అందజేశారు. ఆత్మకూరులోని ఆయన ఛాంబర్లో బుధవారం ఖాదర్ బాషా కుటుంబ సభ్యులకు మందులను అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకట సందీప్, డాక్టర్ కుమార్, తోడేటి అశోక్, రహీం పాల్గొన్నారు. నిరుపేదలకు వైద్య సహాయం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ట్రస్ట్ సేవలను కొనసాగిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యపరమైన సహకారం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని కల్పిస్తాయని స్థానికులు అభినందించారు. సకాలంలో అందిన సహాయం కుటుంబానికి ఉపశమనం కలిగించింది.


