*త్రిశూల్ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలి: ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు*
మాదక ద్రవ్యాల వినియోగ నివారణ, మహిళా రక్షణ, రహదారి భద్రతపై రూపొందించిన త్రిశూల్ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు అధికారులను ఆదేశించారు.
ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన త్రిశూల్ కార్యక్రమ సమీక్ష సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పాల్గొన్నారు.
జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న 54 రహదారి ప్రాంతాల్లో ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదకర కూడళ్ల వద్ద
*వన్ హాట్‌స్పాట్–వన్ ఆఫీసర్* విధానాన్ని అమలు చేయాలని తెలిపారు.
పాఠశాలలు, కళాశాలల్లో త్రిశూల్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నషా ముక్త్ భారత్‌పై గ్రామాల్లో అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల వినియోగం, మహిళలపై నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.
రహదారి భద్రతలో భాగంగా జిల్లాలో సుమారు 300 కాన్వెక్స్ అద్దాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో 18 కాన్వెక్స్ అద్దాలు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.






