విశాఖపట్నం, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ పీఎస్ఆర్ గ్రూప్ అధినేత, న్యాయవాది పెంటకోట శంకర్రావు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు.
పీఎస్ఆర్ గ్రూప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు శంకర్రావు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా అవసరమైన వారికి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించడంతో పాటు, పీఎస్ఆర్ గ్రూప్ ద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా స్థానికంగా అనేక కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
తాను స్థానిక వ్యక్తిగా ప్రజలతో నిరంతరం మమేకమై ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నానని, న్యాయవాదిగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు సేవలు అందిస్తున్నానని శంకర్రావు వివరించారు. స్థానికంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేయాలనే ఉద్దేశంతోనే కార్పొరేటర్ అభ్యర్థిత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున తనకు కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరారు. అవకాశం లభిస్తే పార్టీకి విధేయంగా పనిచేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కృషి చేస్తానని పెంటకోట శంకర్రావు తెలిపారు.




