జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రథమ స్థానం.. జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపిక
విశాఖపట్నం జిల్లా | ఆనందపురం | (పున్నమి ప్రతినిధి) | అక్టోబర్ 1
లోడగలవానిపాలెం పంచాయతీ పరిధిలోని నేల్తేరు గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఆనందపురం విద్యార్థిని బి. లేఖ్య సైన్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికై పాఠశాల కీర్తిని జాతీయ స్థాయి వేదికపై నిలిపింది.
“INDIAN ENERGY BASKET 2047” అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్లో లేఖ్య ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. రాష్ట్ర స్థాయిలోనూ తన ప్రతిభను చాటుతూ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న బి. లేఖ్య, ఆరో తరగతి నుంచే కేజీబీవీ ఆనందపురంలో విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. సైన్స్‌పై ఆసక్తి, క్రమశిక్షణ, నిరంతర సాధనతో ఈ ఘన విజయాన్ని సాధించింది.
లేఖ్య విజయంపై ప్రిన్సిపాల్ హర్షం
విద్యార్థిని సాధించిన విజయంపై కేజీబీవీ ప్రిన్సిపాల్ డి. చంద్రకళ, సైన్స్ ఉపాధ్యాయురాలు పి.టి.ఎస్. ప్రసాదిని హర్షం వ్యక్తం చేశారు. సైన్స్ పట్ల లేఖ్యకు ఉన్న ఆసక్తి, కఠోర శ్రమ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రుల ఆనందం
కుసులువాడ గ్రామానికి చెందిన లేఖ్య తల్లిదండ్రులు బెల్లాన అప్పలనాయుడు, బెల్లాన లక్ష్మి తమ కుమార్తె సాధించిన ఘనతపై ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను ప్రోత్సహించిన ప్రిన్సిపాల్, సైన్స్ ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ స్థాయికి ఎంపికైన బి. లేఖ్యకు కేజీబీవీ దత్తత ప్రదాత శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ గారు. పేరెంట్స్ చైర్మన్ పావని గారు మరియు కమిటీ సభ్యులు సిబ్బంది, విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తూ.. జాతీయ వేదికపై కూడా విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షించారు.



