ప్రజలకు అర్థమయ్యేలా నోటిఫికేషన్‌ను తిరిగి విడుదల చేయాలని డిమాండ్
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు పురపాలక సంఘం వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) నోటిఫికేషన్‌పై ప్రజల తరఫున సిపిఐ(ఎం) పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌కు సిపిఐ(ఎం) ఆత్మకూరు పట్టణ కమిటీ అధికారిక వినతిపత్రాన్ని అందజేసింది.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన వార్డుల డీలిమిటేషన్ నోటిఫికేషన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ కారణంగా ప్రజలు తమ వార్డు హద్దులు ఏవో సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని, దీనివల్ల తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశమే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రధానంగా సర్వే నెంబర్ల ఆధారంగా మాత్రమే వార్డులను విభజించడం అసంబద్ధమని పార్టీ అభిప్రాయపడింది. ప్రజలకు సర్వే నెంబర్లపై అవగాహన తక్కువగా ఉండటంతో వార్డుల పరిధిని అర్థం చేసుకోవడం కష్టమవుతోందని పేర్కొంది. అందువల్ల వీధి పేర్లు, ప్రధాన ల్యాండ్ మార్కులు, కాలనీల వివరాలతో స్పష్టమైన మ్యాప్‌లను జత చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది.అలాగే ఇంటి నెంబర్ల ఆధారంగా వార్డుల హద్దులను స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. ఏ ఇంటి నెంబరు నుండి వార్డు ప్రారంభమవుతుంది, ఏ నెంబరు వరకు ముగుస్తుందో వివరాలు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొంది. దీంతో ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సులభంగా వార్డు పరిధులను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.మరో ముఖ్యమైన అంశంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలను వారికి సమీపంలోని వార్డులకు అనుసంధానం చేయాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల్లో కొన్ని కాలనీలు దూర ప్రాంత వార్డులకు కలపడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది.ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి తగిన సమయం ఇవ్వాలని సిపిఐ(ఎం) పట్టణ కమిటీ కోరింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని సవరించిన నోటిఫికేషన్‌ను తిరిగి విడుదల చేయాలని అధికారులను విజ్ఞప్తి చేసింది.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణాధ్యక్షులు కొప్పోలు డేవిడ్ రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంధాని, సిపిఎం పార్టీ నాయకులు నాగయ్య, రమణయ్య, మాల్యాద్రి, మహబూబ్ బాషా, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


