ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అర్చకులు ఎస్‌టీకే వెంకటేశ్వర్లు కుటుంబానికి దూప దీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం ఆర్థిక చేయూత అందించింది. వెంకటేశ్వర్లు భార్య ఇటీవల ఆడ శిశువుకు జన్మనివ్వగా, నవజాత శిశువుకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అత్యవసర చికిత్స కోసం విజయవాడలోని అనువై బేబీ కేర్ సెంటర్‌లో చేర్పించారు. చికిత్స ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అవసరమని మండల డీడీఎన్ అధ్యక్షులు కొత్తూరు రాజేష్ శర్మ, అర్చకులు కాశవజ్జల నరసింహమూర్తిని ఆశ్రయించగా, వారు ఈ విషయాన్ని జిల్లా సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన జిల్లా డీడీఎన్ అర్చక సంఘం జిల్లాలోని అర్చకుల సహకారంతో రూ.81 వేల విరాళాన్ని సేకరించి వెంకటేశ్వర్లు కుటుంబానికి అందజేసింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డీడీఎన్ అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ, కార్యదర్శి మరింగంటి భార్గవాచార్యులు, రాష్ట్ర డీడీఎన్ అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నావజ్జల ప్రసాద్ శర్మ, నేలకొండపల్లి మండల అధ్యక్షులు చిలుకూరు నాగమూర్తి, అర్చకులు కె. చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్‌టీకే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, క్లిష్ట సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన జిల్లా డీడీఎన్ అర్చక సంఘానికి, జిల్లాలోని అర్చకులందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొంటూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.



