బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు.. ఆలయాల వద్ద అభివృద్ధి పనులకు శ్రీకారం ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఆదివారం నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని సందడి చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో బోనాల వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఎమ్మెల్యే రాకతో వేడుకలు మరింత సందడిగా మారాయి. కవాడిపల్లిలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. పెద్దఅంబర్‌పేట్ డివిజన్ పరిధిలోని కుంట్లూరులో నిర్వహించిన పోచమ్మ బోనాలకు హాజరైన ఆయన ఆలయం వద్ద హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అదేవిధంగా తట్టిఅన్నారం హౌజింగ్ బోర్డు కాలనీలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూగర్భ డ్రైనేజీ, చిల్డ్రన్ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


