గంజాయి, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై నిఘా పెంచాలి: సిపీ సునీల్ దత్
ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గంజాయి వినియోగం, విక్రయాలు, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గంజాయి నెట్‌వర్క్‌ను ఛేదించడంతో పాటు వినియోగదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ మోసాలపై వేగంగా స్పందించి, బ్యాంకులతో సమన్వయంతో బాధితుల నగదును ఫ్రీజ్ చేయాలని తెలిపారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి, ఓటీపీ, ఫేక్ లింక్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి, అతివేగం, డ్రంక్ డ్రైవింగ్, రాంగ్‌రూట్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.


