Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #RicePrices #TelanganaNews #UttamKumarReddy #RicePriceControl #BPT66 #CivilSupplies #PunnamiNews

హైదరాబాద్

బియ్యం ధరలు పెంచితే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

-అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెటింగ్‌పై ఉక్కుపాదం -బీపీటీ బియ్యం కిలో రూ.66 మించకూడదు -బియ్యం వ్యాపారులపై ఇప్పటికే 12 కేసులు ఏలినీనో ప్రభావాన్ని సాకుగా చూపుతూ నిత్యావసర సరుకులు, ముఖ్యంగా బియ్యం ధరలను అడ్డగోలుగా పెంచే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం బేగంపేట కుందన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బీపీటీ బియ్యం కిలో ధర రూ.66కు మించకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యం ధరలను నాణ్యత, ఉత్పత్తి వ్యయాల ఆధారంగా సమీక్షించాలని సూచించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే 12 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఐదు శాఖల సమన్వయంతో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లోని బియ్యం వ్యాపార కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా బేగంబజార్‌, నాంపల్లి, మహరాజ్‌గంజ్‌ టోకు మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో తగినంత బియ్యం నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని మంత్రి కోరారు. రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ధరలు స్థిరపడే వరకు తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించే వ్యాపారులతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తదితర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.