ఖానాపురం పున్నమి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నవంబర్ 29తో 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
11 రోజుల పాటు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, గుర్తింపు కార్డులు, అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉచిత వైద్య, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను గుర్తించే ప్రక్రియను వెంటనే ప్రారంభించి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరించారు.
