ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి
—————————————————————
*రబీ ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణకు ప్రత్యేక కార్యాచరణ.. రైతుల వివరాల నమోదు కోసం ప్రత్యేక ఆన్లైన్ యాప్*
*రైతులు తమకు ఆసక్తి ఉన్న ప్రత్యామ్నాయ పంటలు, సాగు విస్తీర్ణం, వ్యవసాయ అవసరాలను ఏఈఓల ద్వారా నమోదు చేసుకోవాలి*
*యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి*
*ఆరుతడి పంటలు సాగుచేసే రైతుల వివరాలు సేకరించాలి*
*రైతులకు అండగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం*
*గ్రామాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి*
*యాసంగి పంటల ప్రణాళికలో పంటల మార్పిడికి ప్రాధాన్యం*
*రెండు రోజుల్లో ఆరుతడి పంటల సాగు వివరాలతో నివేదిక సమర్పించాలి*
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
యాసంగి సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగుచేసి నష్టపోకుండా చూడాలని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలు అన్ని గ్రామాల్లో పర్యటించి, ఏ రైతు సాగు చేస్తున్నారో వివరాలు సేకరించి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఏఈవోలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రెండు రోజుల పాటు పర్యటించి ఆరుతడి పంటలు ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో అందుకు సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించనుంది.
నీటి లభ్యత, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. చలి కాలంలోనూ ఎండ తీవ్రత కనిపిస్తుండటంతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. దీంతో తక్కువ నీటితో పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండు రోజుల పాటు అన్ని గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులు వారీగా వివరాలు సేకరించనున్నారు. ఎవరైనా రైతులు వరిని సాగుచేసే ప్రయత్నాలు చేస్తే వారికి అవగాహన కల్పించి విరమింపజేయనున్నారు.
*పంటల మార్పిడే ప్రధాన లక్ష్యం*
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని యాసంగి పంటల సాగు కార్యచరణను ఈ నెల 19వ తేదీలోగా రూపొందించాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. అందులో పంటల వైవిధ్యం, పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామాల వారీగా ఎలాంటి పంటలు, ఎంత విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారే దానిపై వివరాలు సేకరించనున్నారు. దీని ఆధారంగా యాసంగి పంటల సాగు కార్యచరణ ప్రణాళిక, జిల్లా స్థాయి ప్రణాళిక పూర్తి చేయాల్సి ఉంటుంది. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రత్యామ్నాయ పంటలపై ముందుగానే రైతులకు అవగాహన కల్పించి, నీరు తక్కువ వినియోగమయ్యే పంటలు, ఆరుతడి పంటలు సాగు అంశాలను యాసంగి కార్యచరణ ప్రణాళికను పొందుపర్చనున్నారు.
*సోలార్ ఫెన్సింగ్, డ్రిప్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్, ప్రెజర్ గన్స్, పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్ల అవసరాల నమోదుకు అవకాశం*
రబీ సీజన్‌కు సంబంధించి పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, వరికి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రైతుల పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, నీటి వనరులు, నీటి పారుదల పరికరాలు, ఇతర వ్యవసాయ అవసరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక ఆన్లైన్ యాప్‌ను రూపొందించారు.
ఈ యాప్‌లో వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) తమ లాగిన్ ద్వారా రైతుల వివరాలను నమోదు చేయనున్నారు. రైతులు తమ గ్రామానికి సంబంధించిన క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి, తమకు ఆసక్తి ఉన్న పంటల రకాలు, సాగు విస్తీర్ణం, నీటి పారుదల సదుపాయాలు, ఇతర అవసరాలను నమోదు చేయించుకోవాలి.
వరి సాగుకు ప్రత్యామ్నాయంగా కుసుమ, టమాటా, బీరకాయ, సొరకాయ, బెండకాయ, మిరప, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, తదితర పంటల సాగుపై రైతులు తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి. ఆయా పంటలకు అవసరమైన సాగు విస్తీర్ణం, డ్రిప్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్, ప్రెజర్ గన్స్ వంటి నీటి పారుదల పరికరాల అవసరాలను కూడా రైతుల వారీగా నమోదు చేయనున్నారు.
*కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్*
జిల్లాలో కోతుల బెడద కారణంగా పంటలకు కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు అవసరాలను కూడా యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఒకే ప్రాంతంలో 25 ఎకరాలకు పైగా భూమి కలిగి ఉన్న రైతులు సమూహంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆసక్తి చూపినట్లయితే, అటువంటి భూములను ఒక సోలార్ ఫెన్సింగ్ క్లస్టర్‌గా ఏర్పాటు చేసేలా ఏఈఓలు వివరాలను నమోదు చేయనున్నారు. ఇందుకు ఆసక్తి ఉన్న రైతులు తమ గ్రామ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నవంబర్ 16వ తేదీ సాయంత్రం లోపు వివరాలను నమోదు చేయించుకోవాలి.
కోతులు, ఇతర వన్యప్రాణుల బెడద నుంచి పంటలను రక్షించేందుకు, 25 ఎకరాల విస్తీర్ణంలో రైతుల బృందం క్లస్టర్‌గా ఏర్పడి పొద్దుతిరుగుడు, వేరుశనగ, కూరగాయలు, తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు వస్తే, వారికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించి అవసరమైన సహకారం అందించడం జరుగుతుంది.
*ఉద్యానవన పంటలు, పంటల వైవిధ్యీకరణకు ప్రోత్సాహం*
పంటల వైవిధ్యీకరణలో భాగంగా జిల్లాలో అధిక విస్తీర్ణంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించనున్నారు. ముఖ్యంగా కూరగాయలు, టమాటా, బీరకాయ, సొరకాయ, బెండకాయ, మిరప, ఆకుకూరల సాగును ప్రోత్సహించడంతో పాటు, ఒక మీటరు కంటే తక్కువ ఎత్తు పెరిగే పంటలకు స్ప్రింక్లర్ పద్ధతిలో నీటి పారుదల సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా మిరప, సుగంధ ద్రవ్యాలు, కలబంద తదితర పంటల సాగుకు అనువైన పంటల కలయికలను గుర్తించి రైతులను ప్రోత్సహించనున్నారు.
*పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్ల అవసరాల నమోదు*
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేపియర్ గడ్డి, పశుగ్రాస జొన్న, పశుగ్రాస మొక్కజొన్న తదితర పశుగ్రాస పంటల విత్తనాల అవసరాలను రైతుల వారీగా నమోదు చేయనున్నారు. అలాగే ఉద్యానవన శాఖకు సంబంధించిన మినీ ట్రాక్టర్ల అవసరాలను కూడా రైతుల వారీగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
*ఆధునిక సాగు పద్ధతులపై ప్రత్యేక దృష్టి*
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా తమ భూముల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా పత్తి సాగు చేస్తున్న రైతులను పంటల మార్పిడి వైపు ప్రోత్సహిస్తూ డ్రిప్ పద్ధతిలో కూరగాయలు, మిరప సాగు చేపట్టేలా అవగాహన కల్పించనున్నారు.
మొక్కజొన్న సాగులో డ్రిప్ ఇరిగేషన్, సోలార్ ఆధారిత విధానాలను ప్రోత్సహించడంతో పాటు, పొద్దుతిరుగుడు సాగులో డ్రిప్ ఇరిగేషన్ మరియు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు, కలబంద సాగు, డ్రిప్ ఇరిగేషన్‌తో పసుపు, అల్లం సాగును ప్రోత్సహించనున్నారు.
*రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా–
రైతులు తమకు అవసరమైన పంటల రకాలు, సాగు విస్తీర్ణం, నీటి పారుదల పరికరాలు, సోలార్ ఫెన్సింగ్, పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్లు, తదితర వ్యవసాయ అవసరాల వివరాలను నిర్ణీత గడువులోగా తమ గ్రామ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ఆన్లైన్ యాప్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పంటల వైవిధ్యీకరణ, ఆధునిక సాగు పద్ధతుల అమలు, వివిధ శాఖల సమన్వయంతో రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడం, సాగు ఖర్చులను తగ్గించడం, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఆరుతడి పంటల రైతులకు ప్రోత్సాహం: డీఏఓ అంబికా సోనీ–
రైతులు ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దు. నీటి వనరులకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలి. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి.

