Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నగరంలో కానరాని ప్లాస్టిక్ నిషేధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నగరంలో కానరాని ప్లాస్టిక్ నిషేధం

– ఫైళ్లలోనే ప్లాస్టిక్ నిషేధం
– ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అమ్మకాలే
– నగర చెత్తలో 50 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే
– ప్లాస్టిక్ నిషేధంపై ఎన్నో అనుమానాలు
– విక్రయదారులతో మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు
– విక్రయదారుల నుంచి నెలనెలా వేలల్లో మామూళ్లు?
– ప్రకటనలకే పరిమితమైన నిషేధం
– పోజులకే నెలవైన దాడులు

జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ప్లాస్టిక్ నిషేధం ప్రకటనలకే పరిమితమైంది. ఫైళ్లలోనే ప్లాస్టిక్ నిషేధం జరుగుతుండగా, పోజులకే దాడులు నెలవవుతున్నాయి. రెండు, మూడు నెలలకోసారి మొక్కుబడిగా ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు జరుగుతుండగా, నగరంలో నిత్యం టన్నుల కొద్దీ ప్లాస్టిక్ విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్లాస్టిక్ విక్రేతల నుంచి కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగం అధికారులకు నెల నెలా మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయదారులతో సంబంధిత నిషేధ అధికారులు మ్యాచ్ ఫిక్సింగ్ జరుపుకొని ఉన్నట్లు ఎల్లెడలా విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి .

రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ తీవ్ర విఘాతం కలిగిస్తున్నా, నెల్లూరు నగరంలో మాత్రం ప్లాస్టిక్ నిషేధం అమలు కావడం లేదు. నగరంలో ప్రతిరోజూ సుమారు 300 నుంచి 320 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఆ చెత్తలో 25 నుంచి 45 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా, ఏ ఖాళీ ప్లాట్‌లో చూసినా, మురుగునీటి కాలువల్లో చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త సంచులే కనిపిస్తున్నాయి. అనేక మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డుపడుతుండడంతో మురుగు ముందుకు పోక, వెనక్కి రాక సమస్యలు సృష్టిస్తోంది.

ఇంతెందుకు, నెల్లూరు నగరం మధ్యలో నుంచి ప్రవహించే సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల్లో సైతం టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయంటే నగరంలో ప్లాస్టిక్ సంచుల వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వేపల్లి కాలువలో రామలింగాపురం ముత్తుకూరు బ్రిడ్జికి పైభాగంలో లాకుల వద్ద ప్రస్తుతం టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. మురుగు ముందుకు పోక, వెనక్కి రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ దృశ్యం చూస్తేనే నెల్లూరు నగరంలో ప్లాస్టిక్ నిషేధం ఎంత గొప్పగా అమలవుతోందో నిరక్షరాస్యులకు కూడా ఇట్టే అర్థమైపోతుంది. ప్లాస్టిక్ నిషేధ కార్పొరేషన్ అధికారుల పనితీరు ఏ స్థాయిలో ఉందో ఈ చెత్త వ్యర్ధాలను చూస్తే తెల్సిపోతుంది .

నగరంలో గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ సంచులకు ప్రజలు బాగా అలవాటుపడిపోయారు. ఇంటి వద్ద నుంచి ఎలాంటి జనపనార, గుడ్డ తదితర సంచులను తీసుకెళ్లకుండా షోగా చేతులూపుకుంటూ దుకాణాలకు వెళ్లడం, అక్కడ ఏదో ఒక వస్తువు కొనడం, ఆ దుకాణాల వారు ఇచ్చే సంచుల్లో కొన్న వస్తువులను ప్యాక్ చేసుకొని రావడం ప్రజలకు కూడా పరిపాటైపోయింది. ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద చూస్తే నిత్యం ఇక్కడే టన్నుకు పైగా ప్లాస్టిక్ సంచులు వినియోగదారుల చేతుల్లో కనిపిస్తాయి.

నగరంలో 5 వేలకు పైగా రోడ్డు మార్జిన్ టిఫిన్ అంగళ్లు, వివిధ చిన్నా పెద్దా హోటళ్లు ఉంటే, వీరు ఇచ్చే పార్సిళ్లన్నీ ప్లాస్టిక్ సంచుల్లోనే. ఇక 150కి పైగా కల్యాణ మండపాలు ఉంటే, ఇక్కడ జరిగే శుభాశుభ కార్యక్రమాల రోజుల్లో వందల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త రూపంలో వస్తున్నాయి. ఇక స్టోన్‌హౌస్‌పేట, రేబాలవారి వీధి, పప్పుల వీధి, ఉచ్చూరువారి వీధి, సాలివీధి, నవాబుపేట ప్రాంతాల్లో నిత్యం 10 టన్నులకు పైగా ప్లాస్టిక్ సంచులు తదితరాలను విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తులు నెల్లూరు జిల్లా అంతటికీ హోల్‌సేల్‌గా సరఫరా అవుతున్నాయి. ఇక నెల్లూరు నగరంలో 3 వేలకు పైగా చిన్న పెద్ద వస్త్ర దుకాణాలు ఉన్నాయి . ఆ నూతన వస్త్రాల , చీరలు తదితరాలను ప్లాస్టిక్ కాగితాల్లోనే ప్యాకేజీలు చేసి ఉంటాయి . ఆ వస్త్రాలు విక్రయించిన తర్వాత వాటి నుంచి కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు టన్నుల పరిణామంలోనే వస్తున్నాయి . ప్రజలు ప్రతి ఉదయాన్నే వస్త్ర దుకాణాల ముందు పారిశుధ్య కార్మికులు చీపుర్లు పట్టి చిమ్మక ముందే పరికించి చూస్తే ఆయా వ్యర్ధాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి .

అయినా పట్టించుకునే దిక్కే నెల్లూరు కార్పొరేషన్‌లో లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి నెలా ప్లాస్టిక్ హోల్‌సేల్ విక్రేతలు ఇచ్చే వేల రూపాయల లంచాలు తీసుకుంటూ, చూసీచూడనట్లు కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్టోన్‌హౌస్‌పేట పరిసరాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య విభాగం సచివాలయ కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, మేస్త్రీలకు ఈ అమ్మకాలు, వాటి నిల్వలన్నీ తెలిసినా ఎందుకు నోరు మెదపడం లేదన్న ప్రశ్నలు ఉన్నాయి. రెండు, మూడు నెలలకోసారి మొక్కుబడిగా దాడులు చేయడం, విక్రేతలను భయాందోళనలకు గురిచేయడం, ఆ తర్వాత చల్లగా వారితో బేరసారాలు మాట్లాడుకోవడం, ఎప్పటిలా వారు ప్లాస్టిక్ విక్రయాలు జరుపుకోవడం నెల్లూరు నగరంలో పరిపాటిగా ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

ఇక ఏసీ కూరగాయల మార్కెట్, హరనాథపురం, రంగనాయకులపేట, సంతపేట, ట్రంక్ రోడ్డు, కాపు వీధి , చిన్నబజారు, పెద్దబజారు, పొదలకూరు రోడ్డు, మూలపేట, వేదాయపాలెం తదితర ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్ విక్రయాలు కొద్దో గొప్పో జరుగుతూనే ఉన్నాయి. అయినా కన్నెత్తి చూసే నాథుడే లేడు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వ్యర్థాలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఓ వైపు పర్యావరణ ప్రేమికులు, సమాజ హితాన్ని ఆలోచించేవారు, చట్ట, న్యాయ వ్యవస్థలు చెబుతున్నా, ప్లాస్టిక్ నిషేధం అమలు తమ బాధ్యత కాదన్నట్లుగా నెల్లూరు కార్పొరేషన్ సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారంటే దీని వెనుక గల మతలబు ఏమిటి? చేతులు మారుతున్న ముడుపుల బాగోతాలు ఏమిటి? అన్న ప్రశ్నలు ప్రజల్లో నుంచి తలెత్తుతున్నాయి.

ప్లాస్టిక్ నిషేధం అమలు విషయంలో నెల్లూరు నగరంలో ఇంతటి దుస్థితికి వెనుక గల కారణాలు ఏమిటి? అధికారులు ఎందుకు ఈ విషయంలో ఇంత ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారు? ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ఏమిటి? అన్న విషయాలపై ప్రస్తుతం నగరంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇకనైనా కార్పొరేషన్ పారిశుద్ధ్య అధికారులు, ఉద్యోగులు ప్లాస్టిక్ నిషేధం సక్రమంగా అమలు కాని విషయంపై వస్తున్న అనుమానాలు, అపవాదులకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది.

నగరంలో కానరాని ప్లాస్టిక్ నిషేధం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *