ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి అభినందనలు.
వెల్లటూరు, రాయనపాడు, కోడూరు గ్రామ పంచాయతీలకు కూటమి అభ్యర్థుల ఖరారు.
ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, నవంబరు 15:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులకు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అభినందనలు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల మద్దతుతో ఎన్నికల్లో ముందుకు సాగాలని అభ్యర్థులకు సూచించారు.
జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మందపాటి అర్జున్ రావు గారిని, విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మందా రాణి గారిని, జి.కొండూరు మండలం కోడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముక్కమల మధుశ్రీ గారిని ఎన్డీఏ కూటమి బలపరిచింది.
ఈ నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థులు మందపాటి అర్జున్ రావు, మందా రాణి, ముక్కమల మధుశ్రీ ఆదివారం గొల్లపూడిలోని మైలవరం శాసనసభ్యుల కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముగ్గురు అభ్యర్థులను అభినందించి, ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి నమ్మకాన్ని, ఆదరాభిమానాలను చూరగొనాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీలే అభివృద్ధికి పునాదులని పేర్కొంటూ, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారిని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని తెలిపారు.
ఎన్డీఏ కూటమి ఐక్యతను, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వెల్లటూరు, రాయనపాడు, కోడూరు గ్రామాల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఆకాంక్షించారు.

