Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

పెద్దలాల్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెద్దలాల్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం..

అర్హులకు అన్యాయం.. అనర్హులకు ఇళ్ల మంజూరా?
పెద్దలాల్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం…

నిరుపేదలను పక్కనపెట్టి రాజకీయ అనుకూలులకే ప్రాధాన్యత ఇచ్చారంటూ ఆరోపణలు?

అర్హులకు అందని ఇందిరమ్మ ఇళ్లు.. అనర్హులకు కేటాయింపులా?

సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఇచ్చారంటూ పెద్దలాల్ తండా గ్రామస్తుల ఆగ్రహం

సిరోల్ మండలం, మహబూబాబాద్ జిల్లా:

పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేటాయింపులపై పెద్దలాల్ తండా గ్రామపంచాయతీలో వివాదం చెలరేగింది. నిజమైన నిరుపేదలకు, కనీసం నివసించడానికి సొంత ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్లు కేటాయించకుండా ఆర్థికంగా స్థితిమంతులైన వారికి, అధికార పార్టీకి చెందిన అనుకూల వ్యక్తులకు, సర్పంచ్, వార్డు సభ్యులకు ఇళ్లు కేటాయించారంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో ఎన్నో పేద కుటుంబాలు నేటికీ సరైన నివాస సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాయని, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పించలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకం నిజమైన లబ్ధిదారులకు చేరాల్సి ఉండగా, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యంగా ఆర్థికంగా మెరుగైన పరిస్థితిలో ఉన్నవారికి, ప్రజాప్రతినిధులకు ఇళ్ల కేటాయింపులు జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలను పక్కనపెట్టి రాజకీయ అనుబంధాలు, వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉద్దేశం నిరాశ్రయులకు, పేదలకు గృహ వసతి కల్పించడమేనని, కానీ అర్హులైన పేదలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల ప్రయోజనం ఎవరికి అందుతున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది బాధ్యతలపై ప్రశ్నలు!
గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాల సేకరణ, అర్హతల పరిశీలన, సంబంధిత రికార్డుల నిర్వహణ, అధికారిక ప్రకటన వంటి ప్రక్రియల్లో గ్రామపంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బంది, అధికారుల బాధ్యత ఏమిటనే ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? క్షేత్రస్థాయిలో నిజమైన నిరుపేద కుటుంబాల పరిస్థితులను పరిశీలించారా? అర్హతల జాబితాను పారదర్శకంగా రూపొందించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఇచ్చారా?
ఆర్థికంగా బాగున్నవారికి, ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు ఇళ్లు కేటాయించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు మాత్రం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ చేపట్టాలి?

పెద్దలాల్ తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని, ఎంపికైన ప్రతి లబ్ధిదారుడి అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బంది, ఎంపిక ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల నుంచి వివరాలు సేకరించి విచారణ జరపాలని కోరుతున్నారు. నిజమైన నిరుపేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అర్హత లేని వారికి కేటాయింపులు జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రిపోర్టర్: భూక్య రాము నాయక్
సిరోల్ మండలం – మహబూబాబాద్ జిల్లా

పెద్దలాల్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం..

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *