Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో భారీగా తగ్గిన ఓటింగ్‌ శాతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో భారీగా తగ్గిన ఓటింగ్‌ శాతం

వార్త ముఖ్యాంశాలు

  • ఓటింగ్‌ శాతం 57.72% మాత్రమే – అభ్యర్థుల్లో గుబులు..
  • అయినా ఎవరి లెక్కలు వారివే – కూటమి ముందంజలో ఉందంటూ అంచనాలు – అభ్యర్థులిద్దరికీ క్రాస్‌ ఓటింగ్‌ దడ – ఓటింగ్‌ శాతం తగ్గడానికి అనేక కారణాలు – ఓటర్లలో పెరిగిన నిరాసక్తత – స్లిప్పుల పంపిణీలో జరిగిన నిర్లక్ష్యమూ ఓ కారణమే ఈ నెల 1వ…
  • మొత్తం డివిజన్లు 72 కాగా, కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,89,351.

ఓటింగ్‌ శాతం 57.72% మాత్రమే

– అభ్యర్థుల్లో గుబులు.. అయినా ఎవరి లెక్కలు వారివే
– కూటమి ముందంజలో ఉందంటూ అంచనాలు
– అభ్యర్థులిద్దరికీ క్రాస్‌ ఓటింగ్‌ దడ
– ఓటింగ్‌ శాతం తగ్గడానికి అనేక కారణాలు
– ఓటర్లలో పెరిగిన నిరాసక్తత
– స్లిప్పుల పంపిణీలో జరిగిన నిర్లక్ష్యమూ ఓ కారణమే

ఈ నెల 1వ తేదీన జరిగిన నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం బాగా తగ్గిపోయింది. మొత్తం డివిజన్లు 72 కాగా, కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,89,351. పోలైన ఓట్లు కేవలం 2,82,466 మాత్రమే. ఇది మొత్తం ఓట్లలో 57.72 శాతంగా ఉంది. అంటే మొత్తం ఓట్లలో 42.28 శాతం ఓట్లు పోల్‌ కాలేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

ఆయా డివిజన్లకు సంబంధించిన పోలింగ్‌ బూత్‌ల బీఎల్‌వోలు ఓటరు స్లిప్పులను అనేకచోట్ల సకాలంలో అందించలేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే, 54 డివిజన్లు ఉన్న నెల్లూరు నగరాన్ని డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో 72 డివిజన్లుగా మార్చడంతో అనేక కొత్త హద్దులు వచ్చి చేరాయి. దీంతో ఆయా ఓటర్ల ఓట్లు ఏ డివిజన్‌లోకి వచ్చి చేరాయో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఓట్లు ఏ డివిజన్‌లో ఉన్నాయో చాలామంది నిరక్షరాస్యులకు అర్థం కాలేదు.

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో మీ ఓటు మీరే చూసుకోవచ్చని చెప్పినా, ఆ ఓట్లు చూసుకునేందుకు తీరిక చేసుకోవడంలో, శ్రమ తీసుకోవడంలో చాలామంది ఓటర్లు విఫలమయ్యారు. అలాగే, ఎన్నికల అధికారులు హెల్ప్‌లైన్లు పెట్టామని ప్రకటనలు ఇచ్చినా, ఆ హెల్ప్‌లైన్లకు ఆశించినన్ని ఫోన్లు రాలేదు. క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రంగా ఉండగా, కొందరు బీఎల్‌వోలు ఓటింగ్‌ జరుగుతున్న పోలింగ్‌ బూత్‌ల వద్ద ఆదివారం ఉదయం కూడా స్లిప్పులు పంచుతూ కనిపించారు.

ఏదేమైనా, డీలిమిటేషన్‌లో జరిగిన గందరగోళం, ఓటరు స్లిప్పులు పంచడంలో నెలకొన్న నిర్లక్ష్యం, సందిగ్ధతలు కూడా ఓటింగ్‌ శాతం తగ్గేందుకు దోహదం చేసినట్లు పరిశీలకులు చెబుతున్నారు.

ఇక దానికి తోడు ఓ వైపు వర్షం, తుఫాను వంటి హెచ్చరికలు కూడా కొంతమందిని పోలింగ్‌ బూత్‌లకు దూరం చేశాయి. ఆదివారం ఉదయం నెల్లూరులో ఓ మోస్తరు వర్షం కూడా కురవడం కొంత అడ్డంకిగా మారింది. ఆదివారం కావడంతో క్రైస్తవ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువ శాతం చర్చిలకు వెళ్లి, అక్కడే ప్రార్థనల్లో పాల్గొనడంతో ఉన్న సమయం కాస్తా అక్కడే గడిచిపోయింది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా పోల్‌ కాలేదనే వార్తలు కూడా వినవచ్చాయి.

ఇక పోలింగ్‌కు ఒకటి, రెండు రోజుల ముందు ప్రధాన పార్టీలు ఇచ్చిన తాయిలాలు, పంపిణీ చేసిన నగదు అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా మారడం, కొందరికి ఆ తాయిలాలు అందకపోవడంతో కొంతశాతం ఓటర్లలో ఆగ్రహం, ఆవేదన కలిగాయి.

ప్రధాన అభ్యర్థుల అభ్యర్థిత్వంపై నగర ప్రజల్లో కొంతశాతం మందికి సరైన అభిమానం లేకపోవడంతో ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటును పక్కన పెట్టేశారు. ఇలాంటి కారణాలతో పోలింగ్‌ శాతం బాగా తగ్గిపోయింది.

ఈ పోలింగ్‌ శాతం తగ్గడం వెనుక ఏ కారణాలు ఉన్నాయోనని ప్రధాన పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో పార్టీ తమకు అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశలు పెంచుకుని ఉన్నా, జరిగిన పోలింగ్‌ శాతాన్ని చూసి తమ ఆశల గణాంకాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. తగ్గిన పోలింగ్‌ ఎవరికి మేలు చేకూరుస్తుందన్న చర్చలు, తర్జనభర్జనలు కూడా జరుగుతున్నాయి.

అలాగే, రూరల్‌ నియోజకవర్గంలో ఇప్పటికే 8 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై ఉండటంతో, ఆ 8 డివిజన్లలో ఎన్నికలు పోటాపోటీగా జరగలేదన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా నెల్లూరు మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *