కన్నులపండువగా కూటమి చైర్పర్సన్ అభ్యర్థి కన్నెగంటి అమూల్య గారి నామినేషన్.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి కొండపల్లి వరకు జనసంద్రంగా మారిన ర్యాలీ.
కొండపల్లి సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి.
– మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, అక్టోబర్ 18, 2026:
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన చైర్పర్సన్ అభ్యర్థి కన్నెగంటి అమూల్య గారి నామినేషన్ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి కొండపల్లి వరకు సాగిన భారీ ర్యాలీతో పరిసర ప్రాంతాలు పసుపుమయమయ్యాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రింగ్ సెంటర్ జనసంద్రంగా మారింది. కూటమి శ్రేణుల నినాదాలు, ఉత్సాహం మధ్య చైర్పర్సన్తో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొని అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. మిత్రపక్షాల నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కొండపల్లి అభివృద్ధికి రూ.96 కోట్ల కేటాయింపు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. తాను తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన సమయంలో రెండు గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినప్పటికీ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు కాలేదని విమర్శించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేందుకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఇంటింటికీ తాగునీటి కుళాయిల పథకానికి రూ.55 కోట్లను మంజూరు చేసి పనులు ప్రారంభించిందని వెల్లడించారు. ఇందులో భాగంగా మూడు కొత్త నీటి రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు కూడా జరుగుతోందని వివరించారు. రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.96 కోట్లను కేటాయించిందని పేర్కొన్నారు. ఇటీవలే రూ.25 కోట్లతో వివిధ ప్రాంతాల్లో రహదారి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు.
పేదల వైద్యానికి రూ.30.20 కోట్ల ఆర్థిక భరోసా.
పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మైలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF), లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) రూపంలో సుమారు రూ.5 కోట్ల సాయమే అందిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లోనే నియోజకవర్గానికి రూ.30 కోట్ల 20 లక్షల మేర ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ఇందులో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాధిత కుటుంబాలకు సుమారు రూ.4.80 కోట్ల వైద్య సహాయం అందిందని తెలిపారు.
రాజకీయాలు, కులమతాలకు అతీతంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక అండ కల్పిస్తున్నామని చెప్పారు. అర్హులైన వారికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, రైతుభరోసా, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, పక్కా గృహాల మంజూరు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో రాష్ట్ర ప్రగతి.
ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఎన్నో ఆర్థిక, పరిపాలనా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
కూటమి ఐక్యతే కొండపల్లి విజయానికి బలం.
కొండపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి పట్టణ ప్రగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో ఇప్పుడు రహదారులు, డ్రైనేజీలు సహా పలు మౌలిక వసతుల పనులు చేపడుతున్నామని గుర్తుచేశారు.
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల పట్టణానికి ఆశించిన ప్రయోజనం ఉండదని విమర్శించారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు స్థానిక సంస్థలలోనూ ప్రజాప్రతినిధుల సహకారం లభిస్తే మరింత వేగంగా పనులు పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.
కూటమి తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా కన్నెగంటి అమూల్య గారిని బరిలో నిలిపామని, జనసేన నుంచి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు సహా మిత్రపక్షాల నాయకులు, బీజేపీ ప్రతినిధులు సమష్టిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. 40 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి కూటమి కుటుంబ సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొండపల్లి మున్సిపాలిటీలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలమన్నారు. కొండపల్లి సమగ్రాభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

