Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం

వార్త ముఖ్యాంశాలు

  • 🔸 _*ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం*_ 🔸 _*స‌ర్వే ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 7 జోన్లకు 14 మంది అధికారుల నియామకం*_ 🔸 _*నాణ్యత, పారదర్శకత, వేగం..
  • రీ–సర్వేలో అత్యంత కీలకం*_ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర రీ–సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…
  • శుక్ర‌వారం నాడు డాక్ట‌ర్ బి.ఆర్‌.

🔸 _*ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం*_
🔸 _*స‌ర్వే ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 7 జోన్లకు 14 మంది అధికారుల నియామకం*_
🔸 _*నాణ్యత, పారదర్శకత, వేగం.. రీ–సర్వేలో అత్యంత కీలకం*_

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర రీ–సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

శుక్ర‌వారం నాడు డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాల‌యంలో స‌ర్వే ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏర్పాటు చేసిన అధికారుల‌తో భూ సర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ సర్వేలో వేగం, నాణ్యతతో పాటు ప్రతి దశలో నిరంతర పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 125 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు లభించిన ఈ అవకాశాన్ని అధికారులు అత్యంత బాధ్యతతో వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

రీ–సర్వేను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు 7 జోన్లకు ఒక్కో జోన్‌కు రెవెన్యూ, స‌ర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది అధికారులను నియమించినట్లు మంత్రి తెలిపారు. సర్వే జరుగుతున్న తీరును, నాణ్యతను, ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు పరిశీలించి స్ధానిక ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సూచించారు.

రాష్ట్రంలో తొలి దశలో 365 న‌క్షాలేని గ్రామాల్లో అలాగే జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2,240 మొత్తం 2768 గ్రామాల్లో రీస‌ర్వే ముమ్మ‌రంగా సాగుతుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు 245 గ్రామాల్లో స‌ర్వే పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ స‌ర్వేను ప‌ర్య‌వేక్షించేందుకు 14 మంది అధికారుల‌ను ప‌ర్య‌వేక్ష‌కులుగా నియ‌మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మొద‌టి ద‌శ స‌ర్వేను న‌వంబ‌ర్ చివ‌రినాటికి పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.

ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌, జీపీవో, డిప్యూటీ తహసీల్దార్‌ లేదా ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర సిబ్బంది ఉంటారని వివరించారు.

సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి రోజు తహసీల్దార్‌ పర్యటించి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ రోజు ఎక్కడ సర్వే జరిగింది? ఎన్ని ఎకరాలు/సర్వే నంబర్లు పూర్తయ్యాయి? ఎన్ని గ్రామాల్లో పని జరుగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? సర్వేలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? అనే అంశాలపై అధికారులు ప్రతిరోజూ స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు.చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా, భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా రీ–సర్వే జరగాలని మంత్రిగారు స్పష్టం చేశారు.

_*హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు:*_
రీ–సర్వేను రాష్ట్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా పూర్తయిన సర్వే, పనిచేస్తున్న సర్వే బృందాలు, ఉపయోగిస్తున్న రోవర్లు, వాటి లొకేషన్‌ వంటి వివరాలన్నీ డాష్‌బోర్డులో రియల్‌టైమ్‌లో కనిపించేలా టెక్నాలజీని వినియోగించాలని సూచించారు.

సర్వేకు అవసరమైన సర్వేయర్లు, రోవర్లు, సర్వర్లు, ఇతర సాంకేతిక పరికరాలు, సామగ్రి కొనుగోలుకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేస్తుందని, అదనపు రోవర్లను కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

రీ–సర్వే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనద‌ని ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి 15 రోజులకు తాను స్వయంగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు.ప్రభుత్వ భూముల సర్వే సమయంలో సరిహద్దులను గుర్తించే ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల‌ని ఆదేశించారు.

రీ–సర్వే పేరుతో స్థానికంగా ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రిగారు హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

_*మీడియా చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి:*_
శుక్ర‌వారం నాడు స‌చివాల‌యంలో త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎర్రవల్లిలో 385 ఎకరాలలో 45 ఎకరాలు తక్కువ ఉందని. సర్వే కోసం మరొక సారి నోటీసులు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఎర్రవల్లిలో అసైన్డ్ భూములు కొన్ని చేతులు మారాయి వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అమరవీరులను గుర్తించి వాళ్లకు న్యాయం చేస్తామ‌న్నారు. ఎర్ర‌వెల్లిలో కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అసైన్డ్ ల్యాండ్ ఉంటే వాటిని పేద‌ల‌కు పంచుతామ‌న్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *