Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

కుబీర్ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కుబీర్ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

వార్త ముఖ్యాంశాలు

  • ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
  • విద్య, మౌలిక వసతులు, పేదల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
  • గురువారం కుబీర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. విద్య, మౌలిక వసతులు, పేదల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గురువారం కుబీర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. భవిత కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు విద్యాసంస్థలను పరిశీలించారు. అనంతరం అర్హులైన ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కుబీర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించి సరస్వతీదేవి ఆశీస్సులు స్వీకరించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పాఠశాల నిర్వహణ, మౌలిక వసతులపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు.

కేజీబీవీలో బతుకమ్మ వేడుకలు
కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులతో సందడి చేశారు. విద్యార్థులు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలను తిలకించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేసి అభినందించారు.
అనంతరం కేజీబీవీ పాఠశాలతో పాటు హాస్టల్‌ను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, విద్యాబోధన, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. నూతన తరగతి గదులు, భవన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పాఠశాల, హాస్టల్‌కు సంబంధించిన సమస్యలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకుని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

వీఓ భవనానికి భూమిపూజ
కుబీర్‌లో నిర్మించనున్న వీఓ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి మహిళా డ్వాక్రా సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం
కుబీర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇళ్ల మంజూరు పేరుతో దళారులను ఆశ్రయించి డబ్బులు చెల్లించవద్దని లబ్ధిదారులకు సూచించారు. ఇళ్లు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, గజిటెడ్ వెరిఫికేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించి నిజమైన అర్హులకే ఇళ్లు మంజూరయ్యేలా చూడాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు తన దృష్టికి తీసుకువస్తే దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా గత పాలకుల హయాంలో కుబీర్ మండలం అభివృద్ధిలో వెనుకబడిందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రోటోకాల్‌ను విస్మరించి వ్యవహరించడం సరికాదని, ప్రజలు ప్రతి పరిణామాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమాల్లో వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, ఉపాధ్యాయులు, కేజీబీవీ సిబ్బంది, విద్యార్థులు, ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *