అక్టోబర్ 8 పున్నమి ప్రతినిధి నిర్మల్
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో విఫలం:ఆత్రం సుగుణక్క
ఆసిఫాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను కాపాడటంలో విఫలమవుతోందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం గురువారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం నియోజకవర్గం ఇంచార్జి శ్యాంనాయక్,కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సుగుణక్క అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. దేశంలో ఓటు చోరీకి తావులేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఉండేలా చూడాలని, ఎవరి ఓటు హక్కు అన్యాయంగా తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఎన్నికల వ్యవస్థకు ఉందన్నారు. ఇటీవల ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు INDIA కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుపై ఆందోళన కలిగించే పరిణామమని అన్నారు.
“ఓటు చోరీ ఆపాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” అని సుగుణక్క అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులను కాపాడటం అందరి బాధ్యత అన్నారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేలా పారదర్శక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని సుగుణక్క స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ తారీక్, మండల అధ్యక్షుడు మురళి, పట్టణ అధ్యక్షుడు ఇమ్రాన్, వాంకిడి మండల అధ్యక్షుడు మంగాజి, కెరమెరి మండల అధ్యక్షుడు సుజాహిద్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల జక్కయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ గడ్డల సత్తయ్య, సీనియర్ నాయకులు చిట్ల నారాయణ, బాలు యాదవ్, మహమ్మద్, విశ్వనాథ్, శంకర్, పేంటు, మహిళా నాయకురాలు కళావతి, యువజన కాంగ్రెస్ నాయకులు సాయికుమార్, ఎలాగల, నైతంబాను తదితరులు పాల్గొన్నారు.
