వార్త ముఖ్యాంశాలు
- – ప్రకటించిన అధినేత వైఎస్ జగన్ త్వరలో జరగనున్న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి పేరును బుధవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో వైఎస్ జగన్ ప్రకటించారు.
- జిల్లా వైసీపీ కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్‌చార్జిగా ఉన్న ఆనం విజయకుమార్ రెడ్డి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
- ఈ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలియవచ్చింది.
– ప్రకటించిన అధినేత వైఎస్ జగన్
త్వరలో జరగనున్న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి పేరును బుధవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో వైఎస్ జగన్ ప్రకటించారు. జిల్లా వైసీపీ కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్‌చార్జిగా ఉన్న ఆనం విజయకుమార్ రెడ్డి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలియవచ్చింది. నెల్లూరు కార్పొరేషన్ ఈ దఫా ఓసీ జనరల్ రిజర్వేషన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్, రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి పేరును అప్పటికప్పుడు ప్రకటించారు. ఈ విషయం తెలియడంతో నెల్లూరులోని ఆనం అభిమానులు, వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, కూటమి పార్టీ అభ్యర్థిగా పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్‌ను కూటమి ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలియవస్తోంది. ఇదే జరిగితే రూప్‌కుమార్ యాదవ్, విజయకుమార్ రెడ్డిల మధ్య ప్రధాన పోరు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలియవస్తోంది.
*– విశ్వసనీయత, విధేయతకే జగన్ పట్టం*
కాగా, రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ తన తొలి అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డిని ప్రకటించడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశ్వసనీయత, విధేయతలకే పట్టం కట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆనం కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో మనుగడ సాగిస్తోంది. విజయకుమార్ రెడ్డి సోదరులైన స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి, ప్రస్తుత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద ముఖ్య అనుచరులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పై ఇద్దరూ సుదీర్ఘకాలం పనిచేసి ఉండగా, అప్పట్లో వారు వైఎస్ రాజశేఖర రెడ్డికి జిల్లాలో ముఖ్య అనుచరులుగా గుర్తింపు పొంది ఉన్నారు.
ఆ తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన కొన్ని పరిస్థితులలో వివేకానంద రెడ్డి, రామనారాయణ రెడ్డిలు రాజశేఖర రెడ్డికి దూరమైనా, వారి సోదరులలో ఒకరైన విజయకుమార్ రెడ్డి మాత్రం రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్‌కు అనుచరులుగా ఉండేవారు. దీంతోనే జగన్ తన ప్రభుత్వ హయాంలో విజయకుమార్ రెడ్డి సతీమణి అరుణమ్మకు జడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయినా విజయకుమార్ రెడ్డి కుటుంబం మాత్రం పక్కచూపులు చూడక వైసీపీ పార్టీలోనే కొనసాగారు. విజయకుమార్ రెడ్డి సతీమణి అరుణమ్మ వైసీపీకి చెందిన జడ్పీ చైర్మన్‌గానే ఐదేళ్లపాటు విజయవంతంగా పదవీకాలంలో కొనసాగి పూర్తి చేశారు.
అంతకుమునుపు ఆనం విజయకుమార్ రెడ్డికి డీసీసీపీ బ్యాంక్ చైర్మన్‌గా కూడా జగన్‌మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఆ కృతజ్ఞతతో విజయకుమార్ రెడ్డి కుటుంబం అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ జగన్‌కు విధేయతగా ఉండేవారు. ప్రస్తుతం విజయకుమార్ రెడ్డికి వైసీపీ మేయర్ అభ్యర్థిత్వం కట్టబెట్టడంలో వైఎస్ జగన్ విధేయత, విశ్వసనీయతలకు పట్టం కట్టినట్లు తెలియవస్తోంది.
కూటమి ప్రభుత్వం బీసీ వర్గానికి చెందిన పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్‌కు రానున్న ఎన్నికలలో మేయర్ అభ్యర్థిత్వం ఇస్తారని గట్టి వార్తలు వినవస్తున్న నేపథ్యంలో అసహనంగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి వైఎస్ జగన్ ఈ వ్యూహం పన్నినట్లు తెలియవస్తోంది. ఓసీ జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టడం కూటమి పార్టీలోనే కొంతమందికి రుచించడం లేదు. దీంతో రూప్ పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి ఓసీ సామాజిక వర్గాలు ఒకింత అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ అసంతృప్తిని వైసీపీకి అనుకూలంగా మలుచుకునే వ్యూహం కూడా విజయకుమార్ రెడ్డి పేరును ప్రకటించడంలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు విజయకుమార్ రెడ్డికి ఎలాంటి అవినీతి మరకలు లేకుండా ఉండటం కూడా ఆయనకు కలిసివచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఆనం కుటుంబం దశాబ్దాలుగా ఏసీ సుబ్బారెడ్డి, ఆనం సంజీవరెడ్డి, వెంకటరెడ్డి, స్వర్గీయ వివేకానంద రెడ్డిల నుంచి నేటి రామనారాయణ రెడ్డి వరకు నెల్లూరును కేంద్రంగా చేసుకొని రాజకీయాలు నడుపుతున్నారు. వారి కుటుంబ వ్యక్తి కావడం విజయకుమార్ రెడ్డికి కలిసివచ్చే అంశంగా ఉంది. అలాగే విజయకుమార్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఆయన సోదరులైన ఆనం జయకుమార్ రెడ్డికి సిటీ నియోజకవర్గంలోని ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ విజయకుమార్ రెడ్డికి కలిసివచ్చే అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి, ఇప్పటికి కొన్ని మార్పులు చేర్పులు నెల్లూరు నగరంలో కనిపిస్తున్నాయి. అధికార పార్టీపై ఒకింత అసంతృప్తి మెల్లిగా పొడసూపుతోంది. ఈ దఫా పార్టీ పరంగా కాకుండా అభ్యర్థిని బట్టి చైతన్యమైన నెల్లూరు నగర ప్రజలు ఓట్లు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్ 72 డివిజన్లతో ఎన్నికలకు వెళ్తుండగా, ఇందులో నెల్లూరు సిటీ పరిధిలోకి 36, రూరల్ పరిధిలోకి మరో 36 డివిజన్లు ఉంటున్నాయి. వైసీపీ కూడా 2024 ఎన్నికల తర్వాత నగరంలో కొంతమేర పుంజుకుంది. ఈ నేపథ్యంలో జరగబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలు ఏ అభ్యర్థికి , ఏ పార్టీకి తమ మద్దతు ఇస్తారో, పట్టం కడతారో వేచి చూడాల్సిందే.