విశాఖపట్నం, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): గాజువాక నియోజకవర్గంలో ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ గురువారం ప్రారంభించారు. 73వ వార్డు పరిధిలోని సింహగిరి కాలనీలో తుంపాలమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆదరణకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ ప్రత్యేక అధికారి దయానిధి, సీపీఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.





