పల్లెల ప్రగతే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత..
అల్లూరు ఎస్సీ కాలనీలో రూ.60 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం — పల్లె పండుగ 3.0తో గ్రామీణ అభివృద్ధికి ఊపునిచ్చిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు.
వీరులపాడు: పేద, బడుగు, బలహీన వర్గాల కాలనీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు పేర్కొన్నారు.వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలు, పేదల నివాస ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.పల్లె పండుగ 3.0 కేవలం కార్యక్రమం కాదని.. పల్లెల రూపురేఖలు మార్చే అభివృద్ధి పండుగ అని తంగిరాల సౌమ్య గారు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. నందిగామ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను మంజూరు చేయిస్తూ, నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
రూ.60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పూర్తయితే అల్లూరు ఎస్సీ కాలనీ ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తగ్గనున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ ,ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు,కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




