*సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో వెంకటరత్న*
*బుచ్చినాయుడుకండ్రిగ, సెప్టెంబర్ 25 (ఆంధ్రప్రభ) :*
మండలంలోని గ్రామాల్లో స్వచ్ఛతను పెంపొందించడంతో పాటు ప్రజలను పారిశుధ్య కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు బుచ్చినాయుడుకండ్రిగ మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ రథంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎంపీడీవో ఆధ్వర్యంలో సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు స్వచ్ఛ రథం ద్వారా పొడి చెత్త సేకరణ, దాని ప్రయోజనాలపై వివరించారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీల పరిధిలో ఏప్రిల్ 2026 నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛరథం ద్వారా సుమారు 9,771 కిలోల పొడి చెత్తను సేకరించినట్లు తెలిపారు.
దసరా సందర్భంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 26 వరకు ప్రత్యేకంగా పొడి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి 3 నుంచి 10 కిలోల పొడి చెత్తను అందించిన వారికి కూపన్ అందజేస్తామని, అక్టోబర్ 26న లక్కీడిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. మొదటి బహుమతిగా డిన్నర్ సెట్, రెండో బహుమతిగా ప్రెషర్ కుక్కర్, మూడో బహుమతిగా హాట్ బాక్స్ సెట్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు స్వచ్ఛ రథానికి పొడి చెత్తను అందజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, స్వచ్ఛతను నిరంతరం కొనసాగించాలని ఎంపీడీవో కోరారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


