ఎల్బీనగర్: వనస్థలిపురం లేబర్ అడ్డలో మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గత 15–20 ఏళ్లుగా కరోనా సమయంలోనూ ఎలాంటి విరామం లేకుండా స్వామివారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ప్రతి ఏడాది 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ఈసారి భక్తుల సౌకర్యార్థం 13 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే శనివారం కుంటలో స్వామివారి విగ్రహ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజు లడ్డు వేలం పాట కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది పెద్ద లడ్డు రూ.60 వేలు, చిన్న లడ్డు రూ.30 వేలకు వేలం పలికినట్లు పేర్కొన్నారు. ఈసారి కూడా భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్సవాల సందర్భంగా 1,500 నుంచి 1,800 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మణికంఠ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కోరారు.



