ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి పొలంలో గడ్డి కోయడానికి వెళ్లిన జమయమ్మ (50) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అకస్మాత్తుగా వాతావరణం మారి పిడుగు పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. జమయమ్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని చూసి బంధువులు, గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఆమె మృతి చెందడంతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. పిడుగుపాట్ల సమయంలో ప్రజలు పొలాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.



