ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెనుకవైపు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలంపాట నిర్వహించారు. లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొన్నారు. ఒంటిమిట్ట మాడా వీధిలో నివాసం ఉంటున్న మామిళ్ల మేఘమాల (బ్యూటీ పార్లర్ మేఘమాల రెడ్డి) రూ.2 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాటలో అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్న మేఘమాలను ఉత్సవ నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.అనంతరం బాణాసంచా కాల్చుతూ, డప్పు వాయిద్యాల నడుమ మేఘమాలను ఆమె నివాసం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని సందడిగా నిర్వహించారు. లడ్డూ ప్రసాదాన్ని తమ ఇంటి వద్దకు తీసుకువచ్చిన అనంతరం మేఘమాల కుటుంబ సభ్యులు, నిర్వాహకులు గ్రామస్థులకు ప్రసాదంగా పంచిపెట్టారు. గణనాథుడి లడ్డూ తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని మేఘమాల కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉత్సవాల నిర్వహణకు వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలివేని (అను), తనీశ్వర్రెడ్డి, పూజిత తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


