మన తెలుగు సాహితీవనంలో విప్లవాత్మక అభ్యుదయ భావాలను పండించిన మహాకవి, నాటకకర్త, గేయ రచయిత, వచన కవి, మాజీ శాసనమండలి సభ్యులు, పద్మశ్రీ, పద్మభూషణ్, మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత, డా. బోయి భీమన్న. ఈయన సెప్టెంబర్ 19, 1911 లో తూర్పు గోదావరి జిల్లాలోని మామిడికుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో నాగమ్మ, పుల్లయ్య దంపతులకు జన్మించారు. దళిత, పీడిత ప్రజల అభ్యుదయం కోసం, కులమత రహిత సమాజ స్థాపన కోసం తన కలం పట్టిన గొప్ప దార్శనికుడు. ఈయన రాసిన ‘గుడిసెలు కూలిపోతున్నై’ కవితా సంపుటి తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి. భీమన్న కవిత్వంలో సరళత, మధురత్వం, సమాజం పట్లతన బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయి. అణగారిన వర్గాల చైతన్యానికి భీమన్న సాహిత్యం ఒక దిక్సూచిలా నిలిచిందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 19 భీమన్న జన్మదినం సందర్భంగా పున్నమి పాఠకుల కోసం ఈ సంక్షిప్త కవిత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కులమత రహిత సమాజ సంభవం
సాహితీవనంలో అభ్యుదయ విప్లవం
బోయి భీమన్న కవితాత్మక వైభవం
కవిగా గుడిసెలు భవనాలుగా మారాలని
గేయ రచయితగా మానవత్వాన్ని గెలిపించాలని
నాటకకర్తగా నాణ్యమైన సమాజాన్ని నిర్మించాలని
మార్పు కోసం తపించిన ప్రతిభాఘని.. భీమన్న
సమాజం పట్ల బాధ్యతాయుతమైన తత్వం
అజ్ఞాన అహంకారాలను అణచివేయు చైతన్యత్వం
అసమానతలపై ధ్వజమెత్తిన వైజ్ఞానిక వీరత్వం
సరళమైన మధురత్వం భీమన్న కవిత్వం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


