గుండె స్పందనలు – రక్త ప్రసరణ వివరాలు
విశ్రాంతి సమయంలో గుండె నిమిషానికి 70 నుండి 72 సార్లు కొట్టుకుంటూ, సుమారు 5 లీటర్ల రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేస్తుంది
24 గంటల వ్యవధిలో సుమారు లక్ష సార్లు కొట్టుకుంటూ, రోజుకు7,500 లీటర్ల రక్తాన్ని నిరంతరాయంగా సరఫరా చేస్తుంది.
వేగంగా నడుస్తున్నప్పుడు శరీర అవసరాలకు అనుగుణంగా గుండె నిమిషానికి సుమారు 8 నుండి 12 లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది.
నిరంతరం మనకోసం శ్రమించే గుండెను కాపాడుకోవడం మన బాధ్యత
తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్న క్షణం నుంచి మరణించే వరకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే అద్భుతమైన యంత్రం మన గుండె. నిమిషానికి ఐదు లీటర్లు, రోజుకు ఏడు వేల లీటర్లకు పైగా రక్తాన్ని నిరంతరాయంగా శరీరంలోని ప్రతి భాగానికి చేరవేస్తూ మన జీవనాన్ని నడిపిస్తోంది. శరీరానికి ఇంతటి సేవలందిస్తున్న గుండెను కంటికి రెప్పలా కాపాడుకోవడం మన కనీస బాధ్యత. గుండె కోసం ప్రత్యేకంగా శ్రమించాల్సిన పనిలేదు; మన జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే చాలు.
గుండెను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
సమతుల్య ఆహారం: ఉప్పు, నూనె, పంచదార వాడకాన్ని బాగా తగ్గించాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలను నిత్య ఆహారంలో భాగం చేసుకోవాలి.
నిత్య శారీరక శ్రమ: గుండె కండరాలు బలంగా ఉండటానికి రోజుకు కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వేగంగా నడవటం, పరుగు, ఈత, లేదా సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.
వ్యసనాలకు దూరం: ధూమపానం (స్మోకింగ్) రక్తనాళాలను సంకోచింపజేసి గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి ధూమపానాన్ని పూర్తిగా మానివేయాలి; మద్యపానానికి దూరంగా ఉండాలి
జీవనశైలి వ్యాధుల నియంత్రణ: అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), చెడు కొలెస్ట్రాల్ గుండెకు నిశ్శబ్ద శత్రువులు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏటా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వీటిని అదుపులో ఉంచుకోవాలి.
ఒత్తిడి నివారణ & నాణ్యమైన నిద్ర: తీవ్రమైన మానసిక ఒత్తిడి రక్తపోటును పెంచి గుండెపై భారం మోపుతుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ 7 నుండి 8 గంటల నాణ్యమైన గాఢ నిద్ర గుండె పునరుత్తేజానికి ఎంతో అవసరం.
గుండె బాగుంటేనే మనం బాగుంటాం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని, నిరంతరం మనకోసం స్పందించే గుండెను పదిలంగా కాపాడుకుందాం.
డాక్టర్ ఎం.వి రమణయ్య
రామచంద్రారెడ్డి హాస్పిటల్


