ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి
కొత్తగూడెం, సెప్టెంబర్ 14: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల కాలపరిమితి సెప్టెంబర్ 8తో ముగిసినందున, ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు కోరారు. ఈ మేరకు కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 మైన్, వీకే ఓసీలో గని మేనేజర్లు, డిపార్ట్మెంట్ హెచ్ఓడీలకు సోమవారం వినతిపత్రాలు అందజేశారు.
టీబీజీకేఎస్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాని వీరభద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మైన్లు, డిపార్ట్మెంట్లలో జరిగే అన్ని కమిటీ సమావేశాల్లో గుర్తింపు పొందిన సంఘంతో పాటు అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా, ప్రాతినిధ్యం కల్పించాలని మేనేజర్లను కోరారు. కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ నాయకులు గిన్నారపు మహేందర్, కాగితపు విజయ్‌కుమార్, బూర్గుల రవికుమార్, తిరుపతి, రాజ్‌కుమార్, పీవీకే ఫిట్ సెక్రటరీ నమిల్ల వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



