ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయాలి: సర్పంచుల వినతి
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసి సర్పంచులకు పూర్తి అధికారాలు కల్పించాలని కోరుతూ జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు బుధవారం అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అందే సుభాష్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీల అభివృద్ధి, పరిపాలనలో సర్పంచులపై ఉన్న బాధ్యతలకు అనుగుణంగా అధికారాలు ఉండాలని కోరారు. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఉండటం వల్ల గ్రామపంచాయతీల పరిపాలనలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. చెక్ పవర్‌ను రద్దు చేసి సర్పంచులకు పూర్తి బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.


