వార్త ముఖ్యాంశాలు
- పెద్దపల్లి, ఆగస్టు 31: పాలకుర్తి మండలం భీమ్లానాయక్ తండాకు చెందిన గిరిజన మహిళ ఇస్లావత్ సుజాతకు సంబంధించిన భూమి వివాదంలో రెవెన్యూ అధికారుల తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన…
- పార్టీ నాయకుల ఆరోపణల ప్రకారం..
- సుజాత బతికుండగానే 2006లోనే మరణించినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారని, సర్వే నంబర్ 111లోని 24 గుంటల భూమికి సంబంధించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
పెద్దపల్లి, ఆగస్టు 31:
పాలకుర్తి మండలం భీమ్లానాయక్ తండాకు చెందిన గిరిజన మహిళ ఇస్లావత్ సుజాతకు సంబంధించిన భూమి వివాదంలో రెవెన్యూ అధికారుల తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు. పార్టీ నాయకుల ఆరోపణల ప్రకారం.. సుజాత బతికుండగానే 2006లోనే మరణించినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారని, సర్వే నంబర్ 111లోని 24 గుంటల భూమికి సంబంధించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పాలకుర్తి తహశీల్దార్ సునీతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి ఆధార్, డిజిటల్ పాస్‌బుక్ వంటి అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ భూమి పట్టా మార్పు ఎలా జరిగిందనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని నాయకులు కోరారు. 37 ఏళ్ల మహిళకు 56 ఏళ్ల వ్యక్తిని మనవడిగా చూపించడం వంటి అంశాలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపై ఏసీబీ ద్వారా విచారణ జరిపించాలని, బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే దానిని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నిరసన దీక్షలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నంపుల్లి శివదాస్, ఉపాధ్యక్షుడు మెరుగు సతీష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేశ్, మండల ఉపాధ్యక్షుడు నేరువట్ల నరేష్, బాబు, రంగు నాగరాజు, మెరుగు జయతో పాటు బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.