కొత్తగూడెం, ఆగస్టు 27: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నివారణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో వ్యక్తుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడకుండా ముందస్తుగా అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువత, కార్మికులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో గంజాయి సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, వినియోగం, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ నిరంతర తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గత సమావేశం నుంచి ప్రస్తుత సమావేశం వరకు నమోదైన మాదకద్రవ్యాల కేసులు, వాటి పురోగతి, నియంత్రణకు తీసుకున్న చర్యలపై అధికారులు సమగ్రంగా వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా కండక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని ఆదేశించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలలు, కార్మిక ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్, రవాణా, వ్యవసాయ, వైద్య ఆరోగ్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని వేణుగోపాల్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

