ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం కార్పొరేషన్ 1వ డివిజన్లో కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి కైకొండాయిగూడెం ప్రాథమిక పాఠశాల వరకు రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే 59వ డివిజన్ దానవాయిగూడెంలో రూ.1.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఖమ్మం క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఓట్ల సవరణ పేరుతో భారీగా ఓట్లు తొలగించే అవకాశం ఉందని, కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.



