దామినేడు ప్రభుత్వ గృహాల్లో డ్రైనేజీ, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలి
సీపీఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్
తిరుపతి ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి
తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని దామినేడు న్యూ బ్లాక్ ప్రాంతంలో తక్షణమే డ్రైనేజీ, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట దామినేడు న్యూ బ్లాక్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జల్లా విశ్వనాథ్ మాట్లాడుతూ, పాలకులు మారుతున్నారే తప్ప పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని విమర్శించారు. దేశ ప్రధాని ‘వికసిత్ భారత్’ అంటూ గొప్పలు చెప్పడం, దేశం వెలిగిపోతోందని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారుతున్నా పేదల బతుకుల్లో మార్పు రావడం లేదని, పేదల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా, లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇళ్లు లేని నిరుపేదల కోసం అపార్ట్మెంట్లు నిర్మించినప్పటికీ, వాటిలో నివసించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.దామినేడు న్యూ బ్లాక్‌లోని అపార్ట్మెంట్ల చుట్టూ మురుగునీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం అంటువ్యాధులకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారానికి ఒకసారి కూడా తాగునీరు సరఫరా కావడం లేదని, ప్రజలు తాగడానికి నీరు లేక ఎలా జీవించాలని ప్రశ్నించారు.
పెద్దల కోసం 100 అడుగుల బైపాస్ రోడ్లు నిర్మించే పాలకులు, పేదలు నివసించే ప్రాంతాల్లో కనీసం పది అడుగుల సీసీ రోడ్లు కూడా నిర్మించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండటం పేదలకు శాపంగా మారిందన్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి దామినేడు న్యూ బ్లాక్ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యల పరిష్కారం కోసం అర్జీ సమర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కే. రాధాకృష్ణ, బి. నదియా, బండి చలపతి నగర కార్యవర్గ సభ్యులు కే. పద్మనాభరెడ్డి, ఎన్. శివ, యం. రామకృష్ణ, డి. రామచంద్రయ్య, గోవిందస్వామి, భాష్యం రమణగౌడ్, విజయ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.


