*గార్ల ఒడ్డులో దేవస్థానం నియామకంపై దుమారం*
*ఏ. శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, తాను బట్టి, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మనిషినని చెప్పడం జరిగింది*
*ఈ నియామకం వెనుక పెద్ద మొత్తంలో లక్షల్లో నగదు చేతులు మారినట్లు సమాచారం*
*గ్రామానికి *సంబంధంలేని వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్* *పోస్టు కట్టబెట్టారంటూ గ్రామస్తుల ఆరోపణలు*
*నియామకంపై సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం.. అవకతవకలపై విచారణకు డిమాండ్*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 15
ఏన్కూరు:
గార్ల ఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు గ్రామానికి సంబంధంలేని వ్యక్తిని నియమించడంపై గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కారేపల్లి నివాసి ఏ. శ్రీనివాస్‌ను ఈ పోస్టులో నియమించారని, నియామక ప్రక్రియపై గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నియామకంపై ఏ. శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, తాను బట్టి, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మనిషినని, తనను ప్రశ్నించేందుకు ఎవరు అని దురుసుగా మాట్లాడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది.
దేవస్థానం వంటి ప్రజా విశ్వాసానికి సంబంధించిన సంస్థలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా, అర్హతలు మరియు స్థానికుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత నియామకాన్ని వెంటనే పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా జరిగితే నియామకాన్ని రద్దు చేసి గ్రామానికి చెందిన అర్హుడిని నియమించాలని కోరుతున్నారు.
అదేవిధంగా ఈ నియామకం వెనుక పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే వాటిని అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దేవస్థానంలో ఉద్యోగ నియామకం జరిగిన విషయం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలకు తెలియకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై కూడా గ్రామస్తులు మండిపడుతున్నారు. దేవస్థాన నియామక ప్రక్రియ, అర్హతలు, ఎంపిక విధానం, నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను బహిర్గతం చేయాలని వారు కోరుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


