ఇదే మీ స్వాతంత్రం*
ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడమేనా హక్కుల కోసం ప్రశ్నిస్తే వేధింపులు..
*అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉంటే ప్రేక్షకులమా*
*ప్రజల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆచరణలో ఎంతవరకు అమలవుతున్నాయన్నది నేటి సమాజం ముందున్న ప్రశ్న*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం:
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా సామాన్యుడి జీవితంలో అనేక రూపాల్లో అన్యాయం కొనసాగుతూనే ఉంది.
అధికారాన్ని ప్రశ్నించే గొంతుకలకు అడ్డంకులు, అవినీతిపై మాట్లాడేవారిపై ఒత్తిళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యుల సమస్యలకు నిర్లక్ష్యం, అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోవడం వంటి అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యుడు ఒక చిన్న పని కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారుల చుట్టూ తిరిగితేనే పని జరుగుతుందనే భావన ప్రజల్లో బలపడటం ఆందోళన కలిగించే విషయం.
మరోవైపు అక్రమాలు, నాణ్యతలేని పనులు, ప్రజాధనం దుర్వినియోగం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ స్ఫూర్తి కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు.
పేదవాడికి ఒక న్యాయం, పలుకుబడి ఉన్నవాడికి మరో న్యాయం అనే భావన ఏర్పడితే ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది.
పోలీస్‌స్టేషన్ నుంచి ప్రభుత్వ కార్యాలయం వరకు ప్రతి చోట సామాన్యుడికి గౌరవం, పారదర్శకత, సమానత్వం అందాలి.
అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, నిర్మించిన రోడ్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతినడం, కాలువలు నాణ్యత లోపాలతో పాడవడం, ప్రజా అవసరాలకు నిర్మించిన మౌలిక వసతులు వినియోగంలోకి రాకపోవడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
ప్రజాధనం ఖర్చవుతున్నప్పుడు నాణ్యతపై ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు.
అలాగే సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కులాలు, మతాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు సమాజానికి తీవ్ర ప్రమాదకరం.
అభిప్రాయ స్వేచ్ఛ పేరుతో ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసే, శాంతిభద్రతలకు భంగం కలిగించే సందేశాలను ప్రచారం చేయడం స్వేచ్ఛకు సరైన అర్థం కాదు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కూడా అత్యంత కీలకం. తప్పును తప్పుగా, నిజాన్ని నిజంగా చెప్పే స్వేచ్ఛ ఉండాలి.
అదే సమయంలో వార్తా ప్రచురణలో వాస్తవ నిర్ధారణ, బాధ్యత, సంబంధిత వర్గాల వివరణకు అవకాశం ఇవ్వడం వంటి జర్నలిస్టిక్ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత మీడియాపైనా ఉంది.
స్వాతంత్ర్యం అంటే కేవలం జెండా ఎగురవేయడం కాదు. భయపడకుండా ప్రశ్నించే హక్కు, అన్యాయంపై గళమెత్తే ధైర్యం, సమానంగా న్యాయం పొందే అవకాశం, అవినీతిని ఎదిరించే వ్యవస్థ, ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడే పాలన
ఇవన్నీ నిజమైన స్వాతంత్ర్యానికి ప్రతీకలు.
ప్రజలు ప్రశ్నించాలి.. అధికారులు సమాధానం చెప్పాలి.
ప్రజాధనం ఖర్చు అయితే లెక్క చెప్పాలి.
అభివృద్ధి పనులు జరిగితే నాణ్యత ఉండాలి.
హక్కులు ఉల్లంఘించబడితే చట్టపరంగా పోరాడే అవకాశం ఉండాలి.
లేకపోతే ప్రశ్న ఒక్కటే
ఇదేనా మనం కోరుకున్న స్వాతంత్ర్యం
ఇదేనా ప్రజాస్వామ్యం
ప్రజలు మేల్కొంటేనే వ్యవస్థ మారుతుంది. ప్రశ్నించే పౌరుడే ప్రజాస్వామ్యానికి అసలైన బలం.


