ప్రజా నాట్యమండలి ఆత్మకూరు అధ్యక్షులు సయ్యద్ షుకూర్
ఆత్మకూరు, ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి): కళా రంగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులను ప్రభుత్వం గుర్తించి, అర్హులైన ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు అందించడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రజా నాట్యమండలి ఆత్మకూరు అధ్యక్షులు సయ్యద్ షుకూర్ కోరారు.
ఆత్మకూరు పట్టణంలోని కాశీనాయన ఆశ్రమంలో కోలాటం, పండరి భజన, వాయిద్య కళాకారులతో సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, కళల పరిరక్షణ, కళాకారుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.కళా ప్రదర్శనల ద్వారా జీవనం సాగించిన అనేక మంది కళాకారులు ప్రస్తుతం వృద్ధాప్యానికి చేరుకోవడంతో శరీరం సహకరించక కళారూపాలను ప్రదర్శించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సయ్యద్ షుకూర్ తెలిపారు. ప్రభుత్వం అలాంటి కళాకారులను గుర్తించి పెన్షన్ అందించాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి కళాకారుడికి ప్రభుత్వ గుర్తింపు కార్డు అందేలా స్థానిక అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజానాట్యమండలి కార్యదర్శి గద్దర్ బాబు మాట్లాడుతూ ప్రజానాట్యమండలి, సరస్వతి జానపద కళలు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళాకారుల సమస్యల పరిష్కారానికి, కళలు–కళాకారుల అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. కమిటీకి ప్రజానాట్యమండలి తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సయ్యద్ షుకూర్ పేర్కొన్నారు.
కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందేలా కృషి చేయడాన్ని నూతన కమిటీ తొలి అజెండాగా ఏకగ్రీవంగా తీర్మానించింది. విశ్వరూప చారి, రమణారెడ్డి, డి. శ్రీనివాసులు, హరికృష్ణ, మోహన్లు నూతన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మండలాల వారీగా ఆత్మకూరు–సీనయ్య, శ్యాంబాబు, నరసింహ; సంగం–బాలకృష్ణ, లక్ష్మయ్య; మర్రిపాడు–శేషయ్య, రత్నయ్య; ఏఎస్‌పేట–అశోక్, నాగార్జున, నాగేశ్వరరావు, నరసింహారావు; సీతారామపురం–రమణయ్య బాధ్యతలు చేపట్టారు.


