ఖమ్మం /తిరుమలయా పాలేం
(పున్నమి న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ )
ఆగస్టు 15 నుంచి కొత్త ఆసరా పింఛన్లు.. తిరుమలాయపాలెంలో రూ.7 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తిరుమలాయపాలెం: అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమిపూజలు నిర్వహించారు.
రూ.7 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
తిప్పారెడ్డిగూడెం నుంచి రాకాసితండా వరకు రూ.2.10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు, రాజారాం నుంచి తుమ్మగూడెం వరకు రూ.4.50 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అలాగే హైదర్ సాయిపేట, పాతర్లపాడు గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున అంచనా వ్యయంతో నిర్మించనున్న పంచాయతీ భవనాలకు భూమిపూజ నిర్వహించారు.
అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
తిప్పారెడ్డిగూడెం అభివృద్ధికి ఇప్పటివరకు రూ.35.55 కోట్లు, హైదర్ సాయిపేటకు రూ.37 కోట్లు, పాతర్లపాడుకు రూ.29.25 కోట్లు, రాజారాం గ్రామానికి రూ.8.48 కోట్లు మంజూరు చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వివరించారు.
పేదలకు ఆర్థిక భరోసా
ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని మంత్రి పేర్కొన్నారు. రైతాంగానికి మద్దతు ధరతో పాటు వరికి క్వింటాలుకు రూ.500 బోనస్, ఎకరాకు రూ.6 వేల రైతు భరోసా జమ చేశామని గుర్తుచేశారు.
8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. పారదర్శకంగా ఎంపిక
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. లబ్ధిదారులు ఎవరికీ ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి ప్రగతి ఆధారంగా ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే బిల్లులు జమ చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండో విడత ప్రొసీడింగ్స్ అందజేస్తామని వెల్లడించారు.
ఆగస్టు 15 నుంచి కొత్త ఆసరా పింఛన్లు
ఆగస్టు 15 నుంచి నూతన ఆసరా పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్‌రెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, డీపీఓ వినోద్‌మార్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

