కమ్మర్‌పల్లి జూనియర్ కళాశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తన వియ్యంకుడు ఏనుగు దయానంద్ రెడ్డి ట్రస్ట్ సౌజన్యంతో కళాశాలకు రూ.1.50 లక్షల విలువైన 40 డ్యూయల్ డెస్క్ బల్లలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2023లో అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో ప్రజల విజ్ఞప్తి మేరకు జూనియర్ కళాశాలను మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కళాశాలను తాత్కాలికంగా సాంఘిక సంక్షేమ పాఠశాల భవనానికి మార్చడం, శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, లెక్చరర్లు, సిబ్బంది కొరతను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కమ్మర్‌పల్లి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.





