*తెలంగాణ ప్రజాగళంగా కేటీఆర్ నాయకత్వం మాజీ మంత్రి పువ్వాడ*
*బీఆర్ఎస్ హయంలో ఖమ్మం అభివృద్ధికి కేటీఆర్ సహకారం*
జులై 24 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి
గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం:
తెలంగాణ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ, ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తి ప్రజాగళంగా నిలుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆయనకు పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, యువతకు అవకాశాలు, పారిశ్రామిక ప్రగతి, ఐటీ రంగ విస్తరణ, పట్టణాభివృద్ధి వంటి అంశాల్లో కేటీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలోనూ ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ సబ్బండ వర్గాల సమస్యలను శాసనసభలోనూ, ప్రజాక్షేత్రంలోనూ గట్టిగా వినిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకుడు కేటీఆర్ అని పువ్వాడ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయంలో ఖమ్మం జిల్లాతో పాటు నగరం సమగ్రాభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధుల మంజూరులో కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తూ ఖమ్మాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు కేటీఆర్ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ప్రజాసేవలో మరింత శక్తి, ఉత్సాహంతో కేటీఆర్ ముందుకు సాగాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.


