బడి వయసు కలిగిన ఏ చిన్నారి కూడా విద్యకు దూరంగా ఉండకూడదనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా చిట్వేల్ మండలం గట్టుమీదపల్లిలో ఆదివారం ఓఎస్‌సీ (అవుట్ అఫ్ స్కూల్ చిల్డ్రన్ ) సర్వే నిర్వహించారు. పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు, జిల్లా విద్యాశాఖాధికారి సూచనల మేరకు మండల విద్యాశాఖాధికారి – 1 ఖాజా మొహిద్దిన్, మండల విద్యాశాఖాధికారి – 2 ఈశ్వరయ్య, క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు బి. దుర్గరాజు ఆధ్వర్యంలో సీఆర్ఎంటీ చంద్రశేఖర్ ఈ సర్వే చేపట్టారు. సర్వేలో బడి బయట ఉన్న ఒంటెల పెంచలమ్మ (8వ తరగతి), ఆవుల శివాని (6వ తరగతి)లను గుర్తించారు. అనంతరం వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్య ప్రాముఖ్యతను వివరించి, ఇద్దరు విద్యార్థినులను చిట్వేల్‌లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బి. దుర్గరాజు మాట్లాడుతూ, గ్రామాల్లో బడి వయసు కలిగిన పిల్లలు ఎవరైనా చదువుకు దూరంగా ఉంటే వెంటనే సంబంధిత సీఆర్ఎంటీ లేదా సమీప ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి చిన్నారికి విద్య అందించడం సమాజం బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం, షూస్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, డిక్షనరీతో పాటు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థిక సహాయం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వంటి అనేక సంక్షేమ సౌకర్యాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సుహాసిని, గట్టుమీదపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Uploaded Video:




