ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 15 సీసీ కెమెరాల ఏర్పాటు. విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ కోసం తీసుకున్న చర్యలని తెలిపిన ఎంఈఓ అనంతలక్ష్మి.
ఆత్మకూరు: పీఎంసీ పథకం కింద నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా పాఠశాల ఆవరణ, గ్రౌండ్, తరగతి గదులతో పాటు ప్రధాన ప్రాంతాలను పూర్తిగా పర్యవేక్షించే అవకాశం కలిగిందని ఎంఈఓ అనంతలక్ష్మి తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల పాఠశాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. అలాగే రాత్రి, పగలు పాఠశాల భద్రతను పర్యవేక్షించడంతో పాటు, తరగతి గదుల్లో విద్యార్థుల చదువు, ఉపాధ్యాయుల బోధన తీరును కూడా అవసరమైనప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుందని చెప్పారు.గతంలో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ట్యాంకు నుంచి నీరు వెళ్లే పైపులను కోయడంతో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఎంఈఓ వివరించారు. అలాగే పాఠశాల గ్రౌండ్‌లో విద్యార్థుల క్రీడా కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా నివారించేందుకు కూడా ఈ కెమెరాలు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పీఎంసీ ప్రతినిధులకు ఎంఈఓ అనంతలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


