
హైదరాబాద్, ప్రతినిధి (పున్నమి న్యూస్):
ఢిల్లీ వెళ్లలేకపోయినా, ఉన్నచోటు నుంచే మన సంఘీభావాన్ని చాటుదామని సామాజిక ప్రజాస్వామ్య వేదిక (SDF) కో-కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి పిలుపునిచ్చారు. లడఖ్ ప్రజల హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ, ఆయన ఆశయాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ మేరకు నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం (పెద్ద అంబేద్కర్ స్టేచ్యూ) వద్ద భారీ క్యాండిల్ లైట్ సంఘీభావ నిరసన (Candlelight Solidarity Protest) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా అకునూరి మురళి మాట్లాడుతూ… “సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న పోరాటం కేవలం లడఖ్ కోసమే కాదు, దేశ భవిష్యత్తు కోసం. ఆయన రక్షణ కోసం, ఆయన నమ్ముకున్న ఆశయం కోసం మనమంతా గొంతు కలపాలి. ఈ నిరసనలో నేను పాల్గొంటున్నాను, సమాజంపై బాధ్యత గల ప్రతి ఒక్కరినీ భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాను” అని పేర్కొన్నారు. హక్కులకై పోరాడే శక్తులకు అండగా నిలిచేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఈ క్యాండిల్ లైట్ ప్రదర్శనకు తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
– సందీప్, పున్నమి న్యూస్.

