ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారిపై రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి కొత్త కార్పొరేషన్ కార్యాలయం వరకు గల ప్రధాన రహదారిపై సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
ప్రధానంగా కవిత కళాశాల మూల మలుపు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడలి, సితార వాణిజ్య సముదాయం మరియు ఇతర వ్యాపార సముదాయాల వద్ద వాహనాలను ఇష్టానుసారంగా రోడ్డు పక్కన నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు సాధారణ ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాల రాకపోకలకూ ఈ ట్రాఫిక్ ఆటంకంగా మారుతోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి, అక్రమ పార్కింగ్‌ను నియంత్రించడం, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించడం, అవసరమైతే ‘నో పార్కింగ్’ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.



