ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో ఓట్ల తొలగింపుల కారణంగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు సైతం ఓటమి పాలయ్యే పరిస్థితులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.బుధవారం నెల్లూరులోని మేకపాటి నివాసంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డిలతో కలిసి బుధవారం ఆత్మకూరు నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో ఎల్ఈడీ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, 23 సంవత్సరాల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ తరపున నియమితులైన బూత్ లెవల్ ఏజెంట్లు బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకుని పార్టీ సానుభూతిపరులు, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బూత్ లెవల్ ఏజెంట్లకు స్థానిక నాయకత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. తద్వారా పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లు, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపుకు గురికాకుండా కాపాడవచ్చన్నారు. వచ్చే 45 రోజుల పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కూడా విక్రమ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల పాటు ప్రజలు ఎదురుచూశారని, కానీ ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి అవినీతి, స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. కూటమి పాలనలో అభివృద్ధికన్నా అప్పులు, అవినీతి పెరిగాయని, భవిష్యత్తు తరాలు అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా కూటమి నాయకులే ప్రస్తుత పాలనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని, ఆ ఫిర్యాదులన్నీ ఇప్పుడు పుస్తకంగా మారాయని విమర్శించారు. అభివృద్ధి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయని, కానీ నియోజకవర్గంలో దోపిడి, అవినీతి కొనసాగుతోందన్నారు. దాదాపు రూ.300 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో దీనివల్ల అర్థమవుతోందన్నారు.ప్రజలు ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేస్తే ప్రజల ఆశీస్సులతో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.



