ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో మంగళవారం ఉదయం ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ఈ బస్సు ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత వెనుక వైపు శబ్దం రావడంతో, డ్రైవర్ వెనక్కి తిరిగి చూస్తూ నడిపాడు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి వంతెన రక్షణ గోడను ఢీకొని, ముందు భాగం వంతెన కిందకు దిగింది.
సుమారు 40 అడుగుల లోతు కాలువలోకి పడిపోతామనే భయంతో ప్రయాణికులు కేకలు వేశారు. అయితే డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో బస్సు నిలిచిపోయింది. దీంతో బస్సులోని 38 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీసి, ప్రయాణికులను మరో బస్సులో రాజమండ్రికి పంపించారు.


